దసరా

దసరా పండగ ఆశ్వీజ మాసంలో వొస్తుంది. లెక్కప్రకారం ఇది దేవీ పండగ. దేవి అంటే కాళికా దేవి. ఆమె మహిషాసురుణ్ణి సంహరించింది. ఆవిడ పేర తొమ్మిది రోజులు ఉత్సవాలు చేస్తారు. వాటికి దేవీనవరాత్రులు అని పేరు. దసరా తొమ్మిది రోజులూ చెయ్యడం ఆచారం తెలుగు దేశంలో ఎక్కువ చోట్ల లేదు. కాని, బడి పిల్లలకి మాత్రం దసరా చాలా పెద్ద పండగ. అప్పుడు బళ్లకన్నింటికీ శలవులిస్తారు.

పూర్వం దసరా తొమ్మిది రోజులూ బడి పిల్లలనందర్నీ వెంట బెట్టుకుని పల్లెటూళ్లల్లో పంతులుగార్లు ఇంటింటికీ వెళ్లి వాళ్ల చేత మంచి మంచి పాటలు పాడించేవారు. ఆ పాటలకి దసరా పాటలని పేరు. పిల్లలు విల్లమ్ములు పట్టుకుని, ఆ పాటలు పాడి, చివర:

జైవిజయీభవ! దిగ్విజయీభవ! అని అనే వారు. అలా అని, బాణాల చివర పువ్వులు పెట్టి, అవి యజమాని మీద పడేలా కొట్టే వారు. పిల్లలందరికీ ఇంటి యజమాని పప్పు బెల్లాలు పంచి పెట్టే వాడు. పంతులుగారికి ‘మాములు’ ఇచ్చి ఆయన్ని సంతోష పెట్టే వాడు.

దసరా మాములు ఇచ్చే ఆచారం ఇప్పటికీ చాలా చోట్ల వుంది. కాని, బడి పిల్లల చేత పాటలు పాడించే అలవాటు వెనక బడిపోయింది.

దసరా పాటలు చాలా ముచ్చటగా వుంటాయి. ప్రతి ఇంటి దగ్గిరా పంతుళ్లు ఒక పాట తప్పకుండా పాడించేవారు. దసరా పాటలు ఎలా వుంటాయో చూపించడానికి మచ్చుకి అందులో కొన్ని చరణాలు చెప్తాను.

ఏదయా మీదయా మామీద లేదు.
ఏడాదికొకసారి వస్తాము మేము.
. . .
పావలా ఇస్తేను పట్టేది లేదు.
అర్థ రూపాయిస్తె అంటేది లేదు.
ముప్పావలా ఇస్తె ముట్టేది లేదు.
ఇచ్చు రూపాయిస్తె పుచ్చుకుంటాము.
. . .
రేపు రా మాపు రా మళ్లి రమ్మనక
చేతులో లేదనక చెప్పలేదనక
పిల్ల వాళ్లకి చాలు పప్పుబెల్లాలు.
అయ్యవారికి చాలు ఐదు వరహాలు.
. . .
జయా విజయీ భవ. దిగ్విజయీ భవ.

ఈ పాటలు పాడుతూంటే విని తీరాలి. పాడడం వచ్చిన వాళ్లని అడిగి చూడండి. పూర్తిగా పాడమని, అర్థం చెప్పించుకోండి.

దసరా పండగ అంటే కుర్రాళ్లకందరికీ సరదా పండగ. కొత్త బట్టలూ, పప్పుబెల్లాలూ, వీరుల్లా విల్లమ్ములు పట్టుకుని వీధుల్లో తిరగడాలు - ఇవన్నీ వాళ్లకి ఎంతో గొప్పగా వుంటాయి.

దసరా శరత్కాలంలో వొస్తుంది. శరత్కాలం అంటే వర్షాలు వెనక బట్టి, ఆకాశం మబ్బులు లేకుండా నిర్మలంగా వుండే రోజులు; పగలు మరీ ఎక్కువ ఎండ లేకుండా వుండే రోజులు; రాత్రుళ్లు వెన్నెల పుచ్చ పువ్వుల్లా తెల్లగా వుండే రోజులు.

అంచేత, దసరా రోజులు తెలుగు వాళ్లందరికీ సరదా రోజులే.

దసరా టీక

దసరా “Dasara,” a Hindu festival.
టీక n. commentary, glossary
ఆశ్వీజ మాసం A month in the lunar calendar coming in August-September.

మాసం Skt. “month”
లెక్క ప్రకారం “strictly speaking”

లెక్క literally, “count”
ప్రకారం n. “according to”
దేవీ పండగ “goddess festival” దేవి “goddess”
కాళికాదేవి “goddess Kali”
మహిషాసురుణ్ణి acc. of మహిషాసురుడు “the demon Mahishasura”
సంహరించింది “killed” సంహరించు Skt. “to kill”
ఆవిడ పేర “in her name” పేరు “name” -అ locative suffix
ఇంకా ఉంది To be continued ...